ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇకపై బ్యాంకులో రూ.2.5లక్షల డిపాజిట్ దాటితే పాన్‌కార్డుతో సహా ఆదాయ మార్గాల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భారీ మొత్తంలో జరిమానా విధించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమ సంపాదన అని తేలితే కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో బంగారం దుకాణదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. కొనుగోలు దారులు పాన్ నెంబర్ సమర్పించకపోతే అసలు బంగారం విక్రయాలు చేపట్టవద్దని ఆభరణ దుకాణదారులకు తెలిపింది. ఒకవేళ కొనుగోలుదారుల నుంచి పాన్ నెంబర్ తీసుకోని పక్షంలో ఆభరణ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పాన్ నెంబర్ తీసుకోవడంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆభరణ దుకాణదారులకు రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సూచించారు.
చిన్న వ్యాపారులు, గృహిణులు, చిరుద్యోగులు.. పన్ను పరిధిలోకి రాని వారు దాచుకునే మొత్తాల గురించి ఎటువంటి ఆందోళన అక్కర్లేదన్నారు. రూ.2లక్షల్లోపు మొత్తాలను జమ చేసేవారిపై ఆదాయపన్ను శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు రావని భరోసా ఇచ్చారు.‘ఈ ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే అన్ని ఖాతాల డిపాజిట్ల వివరాలు తెప్పించుకుంటామని అధికారులు తెలిపారు.
డిపాజిటర్లు సమర్పించిన ఆదాయ రిటర్నులతో పోల్చిచూస్తాం. తేడాలుంటే దానికి 200 శాతం జరిమానా విధిస్తామని హస్ముక్ అధియా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక పురోగతి ఉంటుందని, పన్నుల సేకరణ పెరుగుతుందని చెప్పారు. నగదు లావాదేవీల కంటే బ్యాంకు ఖాతా, చెక్, ఎలక్ట్రానిక్ చెల్లింపులను అనుసరిస్తే మేలన్నారు. మొత్తం కరెన్సీ మార్పిడికి 3-4 వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.