ఇప్పటికే బాలీవుడ్లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. అందుకే..ఇప్పుడు బయోపిక్స్ సీజన్ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భిన్న రంగాల్లో ప్రతిభను చాటిన పలువురు ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కృతం చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. గత కొన్నేళ్లలో చాలా మంది స్పోర్ట్స్ సెలబ్రిటీల జీవిత కథలు సినిమాలుగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర బయోపిక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందన్న వార్త కేవలం సినీ అభిమానుల్లోనే కాదు… రాజకీయ అభిమానుల్లో కూడా ఆసక్తి రేపుతోంది. ఆ బయోపిక్ మరెవరిదో కాదు భారత ప్రధాని నరేంద్ర మోడీది.
చాయ్ వాలా నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకూ మోడీ ఎదిగిన తీరు అమోఘమనే చెప్పాలి. దేశ జనుల ప్రియప్రధానిగా నిలుస్తున్న మోడీ జీవిత కథను మంచి సినిమాగా మలచవచ్చని బాలీవుడ్ మూవీ మేకర్లు అనుకుంటున్నారు.
మరి మోడీ జీవిత కథను సినిమాగా రూపొందించేందుకు ఎవరు ముందుకు వస్తారో తెలీదు కానీ, మోడీ పాత్రలో ఎవరైతే బాగుంటుందనే అంశంపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అంతిమంగా మోడీ పాత్రకు ఎవరైతే బాగుంటుందంటే.. అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది.
మోడీ పాత్రను అక్షయ్ చేస్తే బాగుంటుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారట. మోడీ బయోపిక్ వస్తే అక్షయ్ టైటిల్ రోల్ ను చేయాలని, మోడీ పాత్రను పండించాలని వీరు కోరుకుంటున్నారు.
అలాంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న వాళ్లలో నాటి స్టార్ హీరో, ప్రస్తుత బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా, సీబీఎఫ్సీ చైర్మన్ నిహ్లానీ వంటి వాళ్లు ఉన్నారు. మరోవైపు పరేష్ రావల్‌ను మోడీ పాత్రలో నటింపజేస్తూ ప్రధానమంత్రి బయోపిక్‌ను తీసే ప్రతిపాదన ఒకటి ఉంది.