లాక్‌డౌన్ సడలింపులపై రాష్ట్రాలకు కేంద్రం లేఖలు..

199
Covid Guidelines
- Advertisement -

క‌రోనా వైరస్‌ విజృంభ‌ణ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా కొన్ని స‌డ‌లింపుల‌తో లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. అయితే ఇటీవ‌ల క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతుండ‌టంతో లాక్‌డౌన్ ఆంక్ష‌ల నుంచి ద‌శ‌ల వారీగా స‌డ‌లింపులు పెంచుతూ వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఆ లేఖ‌లో క‌రోనా నిబంధ‌న‌లకు సంబంధించి పలు స‌ల‌హాలు, సూచనలు ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షలు విధించడం లేదా సడలింపులు ఇవ్వాలి అని ఆయన లేఖలో తెలిపారు. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలన్నారు.

టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని సూచించారు. పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలి. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకం. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని అజయ్ భల్లా సూచించారు. ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.

- Advertisement -