ఓయూలో తొలగించిన సెక్యూరిటీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ AITU & AISF హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ చౌరస్తాలో ఓయూ వీసి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 20 సంవత్సరాలుగా అతి తక్కువ జీతంతో పని చేస్తూ నిరంతరం యూనివర్సిటీ పరిరక్షిస్తూ, వర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడిన తెలంగాణ కార్మికులను తొలగించి ఈ ప్రాంతంతో ఎట్లాంటి సంబంధంలేని నాన్ లోకల్ వారికి ఓయూలో ఉద్యోగాలు కల్పించడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు.
కార్మికుల పట్ల ఓయూ వీసీ మోసపూరిత వైఖరి నశించాలన్నారు AITUC హైదరాబాద్ జిల్లా కార్యదర్శి యం.నరసింహ. 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల శ్రమను దోపిడీ చేసుకుని అకారణంగా ముందస్తు సమాచారం లేకుండా కార్మికుల కుటుంబాలను రోడ్డును పడేయడం అమానవీయ చర్య కార్మికుల పట్ల వీసి మోసపూరిత వైఖరినీ ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది ఎండగట్టి కార్మికులకు అండగా తెలంగాణ సమాజం నిలవాలని కోరారు.
వారం రోజుల్లో కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు AISF హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి హరికృష్ణ. సుమారు రెండు నెలలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని వారి కుటుంబాలను ఆదుకోవాలని లేనియెడల ఓయూలో వీసి నీ అడుగడుగున అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC AISF & సెక్యూరిటీ కార్మికులు పాల్గొన్నారు.