ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఆ సంస్థ ఇప్పుడు బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. జియోకి ధీటుగా భారీ ఆఫర్లు ఇవ్వడానికి ముందుకొస్తున్న టెలికాం కంపెనీలలో ఎయిర్ టెల్ కూడా ఒకటి.
ఇదే క్రమంలో రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ.399 ప్లాన్ మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా ఇవాళ రూ.399 ప్లాన్‌ను ప్రారంభించింది.
ఈ ప్లాన్‌తో యూజర్లు రీచార్జి చేసుకుంటే 84 రోజుల వాలిడిటీతో 84 జీబీ డేటా లభిస్తుంది. అయితే రోజుకు కేవలం 1 జీబీ డేటాను మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. ఇక ఈ ప్లాన్‌లో వారానికి గరిష్టంగా 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. వీటితోపాటు లోకల్, ఎస్‌టీడీ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
వారంలో ఉచిత నిమిషాలు అయిపోతే అప్పుడు ఆన్ నెట్ వర్క్ కాల్స్ నిమిషానికి 10 పైసలు, ఇతర నెట్‌వర్క్ కాల్స్ నిమిషానికి 30 పైసల చార్జి పడుతుంది. ఇక ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ప్రకారం కేవలం 4జీ సిమ్‌తో 4జీ హ్యాండ్‌సెట్ వాడేవారికేనని తెలిసింది.
అంతేకాదు, ఎయిర్‌టెల్ మరో ప్లాన్‌ను కూడా ఆఫర్ చేసింది. రూ.244తో రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ కింద కేవలం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కస్టమర్లకు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయముంటుంది.
ఇదిలా ఉండగా..జియో తెరతీసిన ధరల యుద్ధంలో టెలికాం కంపెనీలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, ఐడియా కంపెనీలు భారీగా కుదేలవుతున్నాయి. గత నెలలో ఉచితంగా జియో ఫోన్‌ను లాంచ్ చేసి, మరింత పోటీ వాతావరణానికి జియో తెరతీసింది.