వైసీపీ ఎమ్మెల్యే,సినీ నటి రోజా పెను ప్రమాదం నుంచి బయటపడింది. బుధవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాదు వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురి కాగా ఆ విమానంలో రోజా కూడా ఉన్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో టైరు పేలి మంటలు రావడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్లతో మంటలు అర్పివేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే తాను క్షేమంగా బయటపడ్డానని రోజా తెలిపింది. తృటిలో పెను ప్రమాదం తప్పిందని… విమానం ల్యాండ్ అవుతుండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి, తొలుత మంటలు కనిపించాయని, ఆ తర్వాత కాసేపటికే విమానం రన్‌వేపై ఆగిపోయిందని తెలిపారు. ఏం జరిగిందో అర్థం కాక అందరం భయపడ్డామని, విమానం పేలిపోతుందేమోనని తాను అనుకున్నానని పేర్కొన్నారు.
బుధవారం రాత్రి 9 గంటలకు 77 మంది ప్రయాణికులతో తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో 6E 7117 విమానం రాత్రి 10.30 గంటలకు శంషాబాద్‌లో రన్‌వేపై దిగుతుండగా ఒక్కసారిగా టైర్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం టైరు పేలడం వల్ల చోటుచేసుకుందా? లేదా మరేదన్నా కారణంతోనా అనేది పూర్తిగా తెలియలేదు.