కరీంనగర్‌లో ఎయిమ్స్‌:వినోద్

388
mp vinod
- Advertisement -

ఢిల్లీ కంటే మెరుగైన ఎయిమ్స్‌ ఆస్పత్రిని కరీంనగర్‌లో ఏర్పాటుచేస్తామని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడిన వినోద్ కరీంనగర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌లా కేంద్రంలో పని చేశామన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం మోడీ ప్రభుత్వంపై ఒత్తిడితీసుకొచ్చామని తెలిపారు. కానీ మోడీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

త్వరలో కరీంనగర్‌కు ఎయిర్‌స్ట్రిప్ రాబోతోందన్నారు. తెలంగాణకు నీళ్లు, నిధుల గురించి లోక్ సభలో గళమెత్తామని, తమ ప్రభుత్వ పనితీరును ప్రజలు మెచ్చి మళ్లీ తమకు అధికారం ఇచ్చారని పొగిడారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే పనులు వేగంగా సాగుతున్నాయని, కరీంనగర్‌లో నాలుగు లైన్ల రైల్వే స్టేషన్ జంక్షన్ కాబోతుందన్నారు. కరీంనగర్‌-హైదరాబాద్ రైల్వే లైన్ త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు.

రూ.250 కోట్ల టెండర్‌తో స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయన్నారు. ఐటి టవర్ పనులు, కేబుల్ బ్రిడ్జీ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎల్‌ఎండి కూడా పూర్తి స్థాయిలో రిజర్వాయర్ కాబోతోందని, కరీంనగర్ డైరీ ఒకప్పుడు 70 లక్షలు లీటర్లు ఉండేదని ఇప్పుడు 250 లక్షల లీటర్లకు పెంచామని వినోద్ వెల్లడించారు.

జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. జాతీయ పార్టీల పాలనలో దేశం అభివృద్ధి చెందలేదని చెప్పిన వినోద్ దేశ ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆశయాలు, లక్షాలు, కోరుకుంటున్న అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ప్రగతికి ప్రణాళిక రూపొందించానని చెప్పారు. రాగి, వేప, సిల్వర్, ఓక్ లాంటి మొక్కలను నగరంలో విరివిగా పెంచేలా చేశామని లోయర్ మానేరు డ్యాం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మానేరు నదిపై తీగల వంతెన (హ్యాంగింగ్ బ్రిడ్జి) నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. కరీంనగర్ అభివృద్ధి ఆగకూడదంటే తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు వినోద్.

- Advertisement -