అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు చిన్నమ్మ షాక్ ఇచ్చారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సెల్వం స్థానంలో శ్రీనివాసన్‌ను కోశాధికారిగా నియమించారు. అయితే పార్టీ నుంచి పన్నీరు సెల్వంను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించలేదు. సస్పెండ్ చేస్తే సెల్వం ప్రతిష్ఠ మరింత పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో శశికళ ఆచితూచి వ్యవహరించారు.
పోయెస్ గార్డెన్ లో అత్యవసరంగా జరిగిన అన్నాడీఎంకే పార్టీ అత్యవసరం సమావేశానికి 70 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరైనట్టు తెలుస్తోంది. పలువురు మంత్రులు, ఎంపీలు కూడా మీటింగ్ కువచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్న శశికళ … అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నామన్నారు. పన్నీర్ సెల్వం చెప్పినవన్నీ అబద్ధాలేనని కామెంట్ చేశారు.
మరోవైపు తనను పార్టీ పదవి నుంచి తప్పించడంపై పన్నీర్ సెల్వం తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అమ్మ తనపై ఉంచిన నమ్మకాన్ని ఎవరూ తొలగించలేరని … తాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కార్యకర్తనని.. ఇకపై కూడా అలాగే ఉంటానన్నారు.
మరోవైపు పన్నీర్ సెల్వంను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అన్నాడీఎంకేకు చెందిన కీలకనేతలు సైతం ఆయన ఇంటికి క్యూకట్టారు. వారిలో అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్, సీనియర్ ఎంపీ మైత్రేయన్ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు. శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు … తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలను రచిస్తున్నారు. ప్రస్తుతం పన్నీర్ క్యాంపులో 62 మంది ఎమ్మెల్యేలు చేరిపోయినట్లు తెలిసింది. ఇదే ఊపులో ఢిల్లీ వెళ్లేందుకు కూడా పన్నీర్ సెల్వం సమాయత్తం అయ్యారు.
235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌పార్టీకి 8, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. పన్నీర్ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు కనీసం 117మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆయనకు 62 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు పలుకుతున్నారు. అంటే, మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అత్యధికులు శశికళ అనుచరులే కావడం వల్ల వారు పన్నీర్‌ను సపోర్ట్‌చేసే అవకాశాలు తక్కువ. ఈ పరిస్థితుల్లో ఆయనకున్న ఓకేఒక్క పెద్ద అండ.. ప్రతిపక్ష డీఏంకే!