బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన మోటార్‌సైకిల్ హెల్మెట్‌ను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘనల గుర్తింపు పరికరంగా మార్చాడు. ఈ ఆవిష్కరణను అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా, దీనిపై బెంగళూరు పోలీసులు అధికారికంగా స్పందించారు.
పంకజ్ అనే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, క్రియేటర్ ఈ విషయాన్ని ఎక్స్ (X)లో వెల్లడించాడు. రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే వారితో విసిగిపోయి ఈ ఐడియా వచ్చిందని చెప్పాడు. రోడ్డుపై స్టూపిడ్‌గా నడిపే వాళ్లతో విసిగిపోయాను. అందుకే నా హెల్మెట్‌ను ట్రాఫిక్ పోలీస్ డివైస్‌గా హ్యాక్ చేశాను అని అతడు రాశాడు.
పంకజ్ చెప్పిన ప్రకారం, ఆ హెల్మెట్‌లో ఉన్న ఏఐ ఏజెంట్ తాను డ్రైవ్ చేస్తూనే దాదాపు రియల్‌టైమ్‌లో పని చేస్తుంది. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ సమస్యలు వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ప్రతి ఉల్లంఘనకు సంబంధించిన విజువల్ ప్రూఫ్, లొకేషన్ డేటా, ఇతర వివరాలతో అలర్ట్ ఇస్తుందని, వాటిని నేరుగా అధికారులకు పంపే అవకాశం ఉందని అతడు పేర్కొన్నాడు.
అతడు షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, ఈ హెల్మెట్ సెటప్ రాస్ప్‌బెర్రీ పై ద్వారా పనిచేస్తోంది. కంప్యూటర్ విజన్ మోడల్స్ “నో హెల్మెట్”, “డ్రంక్ డ్రైవింగ్” వంటి ఉల్లంఘనలపై ఎర్ర బాక్స్‌లు చూపిస్తున్నాయి. ఇది విజిలాంటిజం కోసం కాదని, బాధ్యతను పెంచేందుకే అని పంకజ్ స్పష్టం చేశాడు. చివరగా బెంగళూరు వాహనదారులకు గట్టి సందేశం ఇచ్చాడు. BLR ప్రజలారా – ఇకనైనా సేఫ్‌గా రైడ్ చేయండి, లేకపోతే పశ్చాత్తాపపడండి అని హెచ్చరించాడు.
బెంగళూరు సిటీ పోలీసులు తనను నేరుగా సంప్రదించారని పంకజ్ వెల్లడించాడు. అధికారిక @BlrCityPolice అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ “OMG… బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయం నన్ను సంప్రదించింది అని రాశాడు. రోడ్డు భద్రత దృష్ట్యా వినూత్నమైనది, ఆసక్తికరమైనది అని పోలీసులు పేర్కొన్నారు.
Also Read:మోడీ అంటే ఇష్టం అంటూనే..భారత్‌కు ట్రంప్ హెచ్చరిక!

