ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాటలోనే వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో కూడా పయనించారు. తమ దేశంలో అతిపెద్ద కరెన్సీ అయిన 100 బొలివర్ నోటును రద్దుచేస్తున్నట్లు అత్యవసర డిక్రీ జారీచేశారు. కొలంబియాలో భారీ ఎత్తున మాఫియా వర్గాలు ఈ నోట్లను నిల్వ చేశాయని, ఆ మాఫియాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని మదురో ప్రకటించారు. ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అత్యంత ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ విలువైన కొత్త నోట్లు, నాణేలను విడుదల చేసేందుకు వెనిజులా సిద్ధం అవుతోంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 100 బొలివర్ నోటుకు మూడు సెంట్ల కంటే తక్కువ విలువ ఉంది. ఒక హాంబర్గర్ కొనాలంటే 100 బొలివర్ నోట్లు 50 కావాల్సి ఉంటుంది. అంతలా దాని విలువ ఇటీవలి కాలంలో పడిపోయింది. తనకున్న రాజ్యాంగ అధికారాలతో, ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితిలో 100 బొలివర్ బిల్‌ను చలామణిలోంచి తప్పించాలని నిర్ణయించినట్లు మదురో ప్రకటించారు. రాబోయే 72 గంటల పాటు మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయని ‘కాంటాక్ట్ విత్ మదురో’ అనే తన టీవీ షోలో ఆయన తెలిపారు.
వందలకోట్ల కొద్దీ నోట్లను అంతర్జాతీయ మాఫియా ప్రధానంగా కొలంబియా నగరాలతో పాటు బ్రెజిల్‌లో కూడా దాచిపెట్టిందని, కొన్ని జాతీయ బ్యాంకులకు కూడా ఈ కుట్రలో భాగం ఉందని వెనిజులా అధ్యక్షుడు మదురో చెప్పారు. ఆర్థిక వ్యవస్థను అస్థిరత పాలు చేయడానికి వీళ్లంతా ప్రయత్నిస్తున్నారన్నారు. దేశంలోకి వచ్చే అన్ని భూ, విమాన, సముద్ర మార్గాలను మూసేస్తున్నామని.. ఆ నోట్లను వాళ్లు మళ్లీ ఇక్కడకు తేకుండా ఉండటానికే ఇలా చేస్తున్నామని అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ నోట్లను రద్దుచేయడం సరికాదని, రిజర్వు బ్యాంకుకు మరింత పెద్దనోట్లు ముద్రించేందుకు తగినంత సమయం ఇచ్చి ఉండాల్సిందని వెనిజులా రిజర్వు బ్యాంకు మాజీ డైరెక్టర్, ప్రస్తుత విపక్ష సభ్యుడు జోస్ గువెరా అన్నారు. చమురు ఎగుమతులు కూడా పడిపోవడం వల్ల దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిండుకుంటోంది. దీంతో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల దిగుమతి కష్టం అవుతోంది. ఈ సంవత్సరాంతానికి అక్కడ ద్రవ్యోల్బణం 475 శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.