ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఉన్నతాధికారులతో జరిగే ప్రతి సమావేశాన్నీ లైవ్ ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే..చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారన్న ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కావాలనే రాజకీయ చేస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన కేజ్రీవాల్.. అందుకు తగ్గట్టుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, పనితీరులో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇకపై అధికారులు ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా చెక్ పెట్టేందుకు ఇదే సరైన చర్య అని భావిస్తున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్లో సమావేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాలున్నాయి.
ప్రభుత్వానికి చెందిన అన్ని ఫైళ్లను కూడా ఆన్‌లైన్లో పెట్టనున్నట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. ఫైళ్లపై ఎవరు సంతకాలు చేశారు.. ఎవరు చేయలేదు.. తర్వాత సంతకం చేయాల్సిన వాళ్లు ఎవరు అన్నది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. వచ్చేనెలలో ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఒకవేళ ప్రత్యక్ష ప్రసార నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదిస్తే.. అందుకు కావాల్సిన నిధులను ఈ బడ్జెట్‌లోనే కేటాయించాల్సి ఉంటుంది.