వివాహేతర సంబంధాలపై దేశ సర్వొన్నత న్యాయస్ధానం కీలకతీర్పు వెలువరించింది. ఇష్టపూర్వకంగా కొనసాగే(అక్రమ సంబంధం) నేరం కాదని సంచలన తీర్పు వెలువరించింది. భార్యకు భర్తే సర్వస్వం కాదని ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకున్నా నేరంగా పరిణించలేమని తెలిపింది. లింగ సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నదంటూ ఐపీసీ సెక్షన్ 497ను సుప్రీం కొట్టేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.
మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించిన ధర్మాసానం… వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని అభిప్రాయపడింది. వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టంచేసింది.
సెక్షన్ 497 పెళ్లి పవిత్రతను కాపాడుతుందన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. వివాహేతర సంబంధం నేరంగా పరిగణిస్తేనే వివాహ పవిత్రతకు రక్షణ ఉంటుందని వాదించింది. అయితే కోర్టు ఆ వాదనతో అంగీకరించలేదు. సెక్షన్ 497 పురాతన చట్టమని తెలిపింది. చాలా దేశాలు ఈ తరహా చట్టాలను తొలగించాయని తెలిపింది.దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు, కేసులను దృష్టిలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.