ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై హెల్త్ సెస్ అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు అమలులో ఉన్న జీఎస్టీ పరిహార సెస్‌కు బదులుగా ఈ కొత్త విధానం అమలవుతుంది. ఈ కొత్త సెస్, ఎక్సైజ్ డ్యూటీలు 40 శాతం జీఎస్టీకి అదనంగా విధించబడతాయి. బీడీల విషయంలో మాత్రం 18 శాతం జీఎస్టీపై అదనంగా ఈ పన్నులు అమలవుతాయి.
పొగాకు ఉత్పత్తులైన నమలే పొగాకు, ఫిల్టర్ ఖైనీ, జర్దా సెంటెడ్ టొబాకో, గుట్కాలకు కొత్తగా ఎంఆర్పీ ఆధారిత విలువ నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్యాకెట్‌పై ముద్రించిన గరిష్ట చిల్లర ధర ఆధారంగా జీఎస్టీ విలువను నిర్ణయిస్తారు.
గుట్కాపై 91 శాతం, నమలే పొగాకుపై 82 శాతం, జర్దా సెంటెడ్ టొబాకోపై 82 శాతం అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. సిగరెట్లపై పొడవు, ఫిల్టర్ ఆధారంగా వెయ్యి సిగరెట్లకు రూ. 2,050 నుంచి రూ. 8,500 వరకు పన్ను విధించబడుతుంది.
ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు పంచుతారు. కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు వాటాగా అందుతుంది. అలాగే పాన్ మసాలా తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంపై హెల్త్ సెస్ విధిస్తారు. ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తదితర ఆరోగ్య సంబంధిత పథకాలకు వినియోగించి రాష్ట్రాలకు పంచుతారు.
Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!
ఈ హెల్త్ సెస్ ఉద్దేశం ఆరోగ్యం, జాతీయ భద్రత వంటి కీలక రంగాలకు నిరంతర ఆదాయ వనరును ఏర్పాటు చేయడమేనని గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తెలిపారు.

