కాంగ్రెస్‌కు షాకివ్వనున్న అద్దంకి ద‌యాక‌ర్..?

144
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుల్లో అద్దంకి ద‌యాక‌ర్ ముఖ్యుడు. 2014 నుండి పార్టీనే న‌మ్ముకొని ప‌నిచేస్తున్నా… చివ‌రి నిమిషం వ‌ర‌కు త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా స‌తాయించార‌ని, అందుకే గ‌త రెండు సార్లు స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయార‌ని ఆయ‌న శ్రేణులు ఆవేద‌న వ్యక్తం చేస్తుంటాయి. అయినా, పార్టీ కోసం ప‌నిచేస్తూ, టీఆర్ఎస్, బీజేపీల‌ను తిట్టిపోయ‌టంలో అద్దంకి ముందుంటారు. అద్దంకి ద‌యాక‌ర్ ను తుంగ‌తుర్తిలో నెగ‌లనివ్వ‌టం లేద‌ని… ఓవైపు మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, మ‌రోవైపు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ దయాక‌ర్ ప్ర‌త్య‌ర్థికి అండ‌దండ‌లు అందిస్తున్నార‌న్న‌ది ఓపెన్ సీక్రెట్. ఇదే విష‌యాన్ని అద్దంకి ప‌లు వేదిక‌ల‌పై చ‌ర్చించినా ఫ‌లితం లేకుండా పోయింది.

దీంతో ఇటీవ‌ల రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన అసంతృప్త నాయ‌కుల భేటీ స‌మ‌యంలో ఓపెన్ గానే మాజీ మంత్రుల‌ను విమ‌ర్శించారు. ఫ‌లితంగా షోకాజ్ నోటీసు వ‌చ్చింది. నేరుగా పీసీసీని తిట్టిన నేత‌ల‌కు లేని షోకాజ్ నోటీసులు త‌న‌కే ఎందుక‌ని, ఇది స‌వ‌తి త‌ల్లి ప్రేమ కాదా…? అంటూ అద్దంకి ఫాలోవ‌ర్స్ అసంతృప్తి వ్య‌క్తం చేసినా ద‌యాక‌ర్ మాత్రం కాస్త సంయ‌మ‌నంతో ఉంటూ వ‌చ్చారు. త‌న‌కు పీసీసీ చీఫ్, ఇత‌ర నాయ‌కుల అండ ఉంద‌ని భావించారు. కానీ, స‌డ‌న్ గా అద్దంకి సైలెంట్ అయ్యారు. ఎక్క‌డా గ‌తంలో లాగా త‌న వాయిస్ వినిపించ‌టం లేదు.

పార్టీ వాయిస్ ను గాంధీ భ‌వ‌న్ నుండే కాకుండా యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా, టీవీ డిబెట్ల ద్వారా వినిపించే అద్దంకి నోరును సొంత పార్టీ నేత‌లే నొక్కార‌ని… పైగా ఉద్య‌మ నాయ‌కుడిగా, సామాజిక ఉద్య‌మ‌వేత్త‌గా ఉన్న అద్దంకికి ఇప్పుడు సామాజిక స‌మీక‌ర‌ణాల‌పై వ‌చ్చిన ఓ పార్టీ నుండి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు ప్రచారం జ‌రుగుతుంది. పార్టీ మారితే ఇరువురికి లాభ‌మ‌ని…. అద్దంకిపై ఒత్తిడి ఉన్నా, త‌ను ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ ను అవ‌త‌లి పార్టీలు ముంచాల్సిన అవ‌స‌రం లేద‌ని, కాంగ్రెస్ కు కాంగ్రెస్ నేత‌లే శాపం అన్న నానుడి గ‌తం నుండి ఉంద‌ని… ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -