లేడి ఒరియెంటెడ్ చిత్రం.. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే, దాని ప్రభావం సినీ పరిశ్రమలోని మిగతా హీరోయిన్ల సినిమాలపై తీవ్రంగా పడుతుందని నటి తాప్సీ పన్ను అభిప్రాయపడ్డారు. ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తన ప్రాజెక్ట్‌లపై కూడా ప్రభావం పడిందని ఆమె తెలిపారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో లేడీ ఓరియంటెడ్ చిత్రాల పట్ల చూపే ధోరణిని ఎండగట్టారు. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాల్లో కథలో లోపాలు ఉన్నా, కేవలం యాక్షన్, గ్లామర్ ఉంటే ప్రేక్షకులు మరియు నిర్మాతలు ఆదరిస్తారని.. కానీ హీరోయిన్ల సినిమాల విషయానికి వస్తే కథ పర్ఫెక్ట్గా ఉండాలని ఆశిస్తారని అన్నారు.
ఒక పెద్ద స్టార్ హీరోయిన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిస్తే, వెంటనే ఇన్వెస్టర్లు భయపడతారని తాప్సీ చెప్పారు. ఈ రోజుల్లో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఆడటం లేదు, అంతటి స్టార్ సినిమానే ఆడనప్పుడు మిగతా వారివి ఏం ఆడతాయి? అనే సాకుతో నిర్మాతలు కొత్త ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:ISRO:గగన్‌యాన్ అప్డేట్
ఇలాంటి పరిస్థితుల వల్ల ఏటా నాలుగైదు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లో కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు అసలు పట్టాలెక్కకుండానే ఆగిపోతాయని, తన కెరీర్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. ఏదైనా ఒక మహిళా ప్రాధాన్య చిత్రం లేదా హర్రర్ సినిమా హిట్ అయితే, వెంటనే అలాంటి కథలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఫోన్లు చేస్తారని తెలిపారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో రూ. 130 కోట్ల అంచనా బడ్జెట్‌తో వచ్చిన ‘ఆల్ఫా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు మాత్రమే రాబట్టి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం తాప్సీ పన్ను నటించిన ‘గాంధారి’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

