సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, ఆమె కుమారుడు నిహార్ కపూర్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో జయసుధ వైసీపీ కండువా కప్పుకున్నారు. జయసుధతో పాటు ఆమె కుమారుడికి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డే కారణమని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జగన్ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తానని తెలిపారు. జగన్ ఆదేశాల మేరకు పని చేస్తానని జయసుధ స్పష్టం చేశారు.
అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు జయసుధ టీడీపీకి గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన జయసుధ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన జయసుధ…తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై విజయం సాధించారు.
అయితే 2014 ఎన్నికల్లో మాత్రం జయసుధకు పరాభవం తప్పలేదు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న జయసుధ కొద్దికాలం క్రితం టీడీపీలో చేరారు. అయితే తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే జయసుధ ఎక్కడి నుండి పోటీచేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలుగు సినీ తెరపై తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకుంది జయసుధ. ప్రియురాలిగా కవ్వించినా, ఇల్లాలిగా కనిపించినా, మాతృమూర్తిని మరిపించినా, ఆడపడుచుగా అలరించినా జయసుధకే చెల్లింది. కె. బాలచందర్‌తో తీసిన అపూర్వ రాగంగల్ అద్భుత విజయాన్ని సాధించడంతో జయసుధ వెనుదిరిగి చూడలేదు. 43ఏళ్ళ సినీ కెరీర్‌లో ఐదు భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళానికి చెందిన 24 సినిమాలు ఒక్క ఏడాదిలో విడుదలవ్వడం రికార్డ్.