సినీనటి,మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరారు. టీడీపీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జయప్రద తర్వాత యూపీకి మకాం మార్చారు. సమాజ్‌వాది పార్టీలో కీలకనేతగా ఎదిగారు. అమర్ సింగ్ శిష్యురాలిగా పార్టీలో పేరు తెచ్చుకున్నారు. ఎస్పీతో అమర్ సింగ్ విభేదించిన సమయంలో ఆమె అమర్ వెంటే నడిచారు.
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయప్రద తాజాగా బీజేపీలో చేరారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన రాంపూర్ పార్లమెంట్ నుంచి మరోసారి పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎస్పీకి చెందిన బలమైన నాయకుడు అజంఖాన్ పోటీచేస్తున్నారు. ఇప్పుడు ఆయన్నే ఎన్నికల్లో జయప్రద ఢీకొట్టబోతున్నారు.
యూపీలోని రామ్‌పూర్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు ఆమె. ఎస్పీతో అమర్ విభేదించిన సమయంలో రాష్ట్రీయ లోక్‌మంచ్ పేరుతో పార్టీ స్థాపించారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో అమర్‌సింగ్‌తో కలిసి ఆర్‌ఎల్డీలో చేరారు. తాజాగా ఇప్పుడు బీజేపీ నుండి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.