నటుడు విశాల్ ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే విశాల్ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఆయనను బలపరుస్తూ సంతకాలు చేసిన పది మందిలో ఇద్దరి సంతకాలు సరిగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఈసీ తెలిపింది. అయితే ఈ విషయంలో విశాల్ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలు, వాట్సాప్‌లు ఉన్న ఈ కాలంలో కేవలం ఓ లేఖ చూపించి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నామని చెప్పడం సరికాదని అన్నారు.
‘ఈ వ్యవస్థ పట్ల నేను నిరాశ చెందాను. నాకు సరైన సమాధానం కావాలి. కేవలం ఓ లేఖ ఇచ్చి నామినేషన్ రద్దు చేస్తున్నట్లు చెప్పలేరు. ఏం జరిగిందో అందరికీ తెలియాలి. ఈ కాలంలో వీడియో, వాట్సాప్ ఇలా ఎన్నో ఆధారాలున్నాయి. సంతకాలు ఫోర్జరీ చేశారని ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు వారు నా వద్దకు రావాలి. నన్ను అడగాలి. కేవలం ఒకవైపు వాదననే పరిగణలోకి తీసుకుని నా నామినేషన్‌ను తిరస్కరించడం సబబు కాదు. ఈ విషయాన్ని నేను లీగల్‌గా తేల్చుకుంటాను.’ అని విశాల్ మీడియా ద్వారా ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాల్‌తో పాటు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ల నామినేషన్‌ను కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది. వీటితో పాటు పలువురు స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిరసన నేపథ్యంలో తొలుత విశాల్ నామినేషన్‌ను ఆమోదించిన ఎన్నికల సంఘం మళ్లీ రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Democracy at its lowest low !!
Disheartening to hear that the nomination made by me was initially accepted & later when I left, has been announced as invalid.#PoliticalGame
— Vishal (@VishalKOfficial) December 5, 2017