తమిళ చిత్ర పరిశ్రమకు పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు, సలహాలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ పరిశ్రమలోకి ఇతర భాషల వాళ్లను రానివ్వండి.. అప్పుడే ఎదిగే అవకాశం ఉంటుంది.. ఎంత వరకు అలా నిబంధనలు పెట్టుకుని ఉంటామో.. అంత వరకు పైకి ఎదగలేమంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఖండించారు. అలాంటి నిబంధనలు ఎక్కడా లేవని అసలు విషయాన్ని వివరించారు.
నాజర్ మాట్లాడుతూ ‘సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ సమాచారం తప్పుగా ప్రచారం అవుతోంది. తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను. దాన్ని వ్యతిరేకిస్తాను. సినిమా పరిశ్రమ, కళాకారులు అనే వాళ్లకు సరిహద్దులు ఉండవు. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నా సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచనలు చేశారు. తమిళ్ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లు పెట్టుకోండని అన్నారు.
Also Read:పార్టీలు రెడీ.. నోటిఫికేషన్ ఎప్పుడు ?
అంతే కానీ ఇతర భాషల వ్యక్తులని వద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు ఒక భాష అని ఏం లేదు. అన్నీ కూడా ప్యాన్ ఇండియన్ సినిమాలు అయ్యాయి. ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. వారిని ఆదరించింది. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీ శ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రా అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం“ అన్నారు.
Also Read:సభ వాయిదా..మరి ప్రియాంకగాంధీ సంగతేంటి?