డ్రగ్స్ కేసులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నలుగురు మహిళా అధికారుల నేతృత్వంలో జరిగిన ఛార్మీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 4:30 గంటల వరకు సాగింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అబ్కారీ శాఖ చార్మి విచారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సీఐలు విజయలక్ష్మి, శ్రీలత, రేణుక బృందం సిట్ నేతృత్వంలో ఛార్మీ విచారణ ఆరున్నర గంటలపాటు జరిగింది. విచారణ ముగిసిన వెంటనే ఎవరితో మాట్లాడకుండా ఛార్మి తన వాహనంలో వెళ్లి పోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఛార్మి నుంచి ఎలాంటి రక్త, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు తీసుకోలేదని సమాచారం. దీనికి సంబంధించిన వైద్య సిబ్బంది కూడా సిట్ కార్యాలయానికి ఈరోజు రాలేదు.
ఉదయం ప్రారంభమైన విచారణలో ఆమె కుటుంబ నేపథ్యం, సినిమా రంగ ప్రవేశం, సినిమాలకు సంబందించిన సమాచారంపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కెల్విన్, వాహెద్, ఖద్దూస్‌లతో ఉన్న పరిచయంపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కెల్విన్ ముఠా దగ్గర చార్మి ఫోన్ నంబర్ ఉండటం.. వాట్సాప్ మెసేజ్‌లు తదితర వాటిపై ఆరా తీసిన్నట్లు సమాచారం.
మీరు పార్టీలు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళతారు? ఎవరితో వెళతారు? పూరీ జగన్నాథ్ ఇంటిపై బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో రూములు ఉన్నాయా? ఆయన ఇంట్లోనే మత్తుమందులు తీసుకుంటారా? డ్రగ్స్ ఫెస్టివల్స్ జరుగుతాయన్న వార్తలు నిజమేనా? అవి ఎక్కడెక్కడ జరుగుతాయి? పంజాబ్ నుంచి మీ బంధువులు ఎవరైనా డ్రగ్స్ తీసుకువచ్చారా? వాటిని ఎవరికి ఇచ్చారు? సినిమా స్టోరీల డిస్కషన్ వేళ, పూరీ డ్రగ్స్ తీసుకుంటారా? ఆయన నుంచి మీకు డ్రగ్స్ వచ్చాయనడానికి మా వద్ద ఆధారాలు ఉన్నాయి… మీ సమాధానం? విదేశీ టూర్లకు వెళితే ఎక్కడ గడిపేవారు? ఏం చేసేవారు? వీకెండ్ లో పబ్బులకు వెళ్లే అలవాటు మీకు ఎక్కువేగా? సినిమా ఈవెంట్లు ముగిశాక, ఏ తరహా పార్టీలు ఉంటాయి? డ్రగ్స్ వాడకం చాలా కామన్ అట కదా? కెల్విన్ పరిచయం సుదీర్ఘంగా సాగడానికి కారణం ఏంటి? ప్రశ్నలను సంధిస్తుంటే, చార్మీ నీళ్లు నములుతూ, చాలా ప్రశ్నలకు సమాధానాలను దాటవేస్తున్నట్టు సిట్ వర్గాల సమాచారం.