ప్రముఖ మలయాళ నటుడు,దర్శకుడు కెప్టెన్ రాజు ఇక లేరు. కోచిలోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1981లో సినిమా రంగంలోకి ప్రవేశించిన రాజు తెలుగు,తమిళం,మలయాళం,హిందీ,ఇంగ్లీష్ భాషల్లో 500 సినిమాలకు పైగా నటించారు.
ఆయనకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు. జూలైలో కుమారుడి పెళ్ళికై అమెరికా వెళ్తుండగా విమానంలోనే గుండెపోటు వచ్చింది. దీంతో కొచ్చికి తరలించి చికిత్స అందించారు. అప్పటినుండి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.
సినిమా రంగంలోకి రాకముందు ఆర్మిలో పనిచేశారు రాజు. దీంతో ఆయన్ని కెప్టెన్ రాజుగా పిలుస్తుంటారు. 1981లో రక్తం సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. విలన్‌గా తనదైన ముద్రవేశారు. తెలుగులో బలిదానం , శత్రువు , రౌడి అల్లుడు , కొండపల్లి రాజా , జైలర్ గారి అబ్బాయి , మొండి మొగుడు పెంకి పెళ్లాం , మాతో పెట్టుకోకు వంటి చిత్రాల్లో నటించారు.
మలయాళ మూవీ ఒరు స్నేహగథాతో దర్శకుడిగా మారారు. 2012లో ‘పవనాయి 99. 99’ చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.2017లో విడుదలైన మాస్టర్ పిస్ చివరి సినిమా. కెప్టెన్ రాజు మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.