వింగ్ కమాండర్ అభినందన్ పేరే ఇప్పుడు యావత్ భారతవానిలో మార్మోగిపోతోంది. అసలు అభినందన్ కుటుంబ నేపథ్యం ఏంటనే దానిపై నెటిజన్లు తెగవెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుని సెల్యూట్ చేస్తున్నారు. వర్ధమాన్‌ది మిగ్ కుటుంబం…ఆయన తాత,తండ్రి సైన్యంలో పనిచేశారు.
అభినందన్‌లాగే ఆయన తండ్రి ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్ కూడా మిగ్-21 విమానాన్ని నడిపారు. అభినందన్ తాతయ్య కూడా వాయుసేనలో పనిచేశారు. అభినందన్ తండ్రి హైదరాబాద్‌లోని హకీంపేటలో ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు.
సాధారణ జీవితాన్నే ఇష్టపడే అభినందన్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ హీరోలే. ఆయన మాతృమూర్తి శోభ గురించి తెలుసుకుంటే శభాష్ అనాల్సిందే. ప్రాణాలు ఫణంగా పెట్టి వేలాది మందికి వైద్య సేవలు అందించిన ఎల్లలు ఎరగని మానవతావాది.
డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్లో భాగమైన డాక్టర్ శోభ నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లే యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ప్రపంచంలోని సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ఎంతో ధైర్యంగా ఆమె సేవలు అందించారు. పౌర యుద్ధం కారణంగా ఇబ్బందిక పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి తరఫున వాలంటీర్‌గా లైబీరియాలో వేలాదిమందికి ప్రాణం పోశారు.
నైజిరీయాలోని పోర్ట్ హార్‌కోర్ట్‌లోనూ శోభ పని చేశారు. అక్కడ పోర్టబుల్ ఎమర్జెన్సీ సెక్షన్ ప్రారంభించి.. బ్లాడ్ బ్యాంక్, ఐసీయూ ఏర్పాటు చేశారు. ఎందరో గర్భిణులకు చికిత్స అందించి అండగా నిలిచారు. గల్ఫ్ యుద్ధం సమయంలో ఆమె ఆత్మాహుతి బాంబు దాడుల నుంచి తప్పించుకొని మరీ ఎంతో గుండె నిబ్బరంతో ఇరాక్‌లో విధులు నిర్వర్తించారు. రెండు రోజుల పాక్ చెర నుండి భారత్‌లో అడుగుపెట్టిన అభినందన్ కుటుంబసభ్యుల గురించి తెలిసి యావత్ భారతావని సలాం చేస్తోంది.