గురువారం ప్రపంచ సాహిత్యంలో 2021గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని టాంజేనియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
వలసవాదం, శరణార్థుల సమస్యలను ప్రభావవంతంగా వివరించిన రజాక్… వివిధ ఖండాలు, సంస్కృతుల నడుమ శరణార్థులు ఎలా నలిగిపోతున్నారో తన రచనల ద్వారా కళ్లకు కట్టినట్టు చెప్పారు. తాను చెప్పాల్సిన దానిని ఎలాంటి రాజీతత్వం అవలంబించకుండా సూటిగా చెప్పిన రజాక్ శైలి తమను ఆకట్టుకుందని నోబెల్ ప్రైజ్ కమిటీ పేర్కొంది.
ఆఫ్రికా దేశం జాంజిబార్‌లో జన్మించిన అబ్దుల్ రజాక్ గుర్నా ఓ విద్యార్థిగా బ్రిటన్‌లో అడుగుపెట్టి కాలక్రమంలో అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పారడైజ్, బై ద సీ, డెజర్షన్ అనే నవలలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు.