వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం అణువణువునా కనిపించే భక్తి పారవశ్యం తిరుమల సొంతం. శ్రీమహావిష్ణువు చివరి అవతారమైన వేంకటేశ్వరుని అవతారంతో స్వామివారు తిరుమలలో కొలువుండడం ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకం. ఏడుకొండలవాడిగా, వడ్డికాసుల వాడిగా, భక్తుల కొంగుబంగారమైన మలయప్ప స్వామిగా పలు పేర్లతో పిలవబడే తిరుమలలోని స్వామివారి ఆలయం చరిత్ర ప్రసిద్ధం.
ఇంత ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాల కోసం వసతులను కల్పిస్తు అందరి మన్ననలు పొందుతోంది. ఇటీవలె శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించిన టీటీడీ తాజాగా వడ్డికాసుల వాడి దర్శనానికి ఆధార్ తప్పనిసరి చేయనుంది.
ప్రస్తుతం నిత్యమూ సుమారు 75 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుండగా, వీరిలో 98 శాతం కుటుంబ పెద్దల వద్ద, వెంట వచ్చే వారిలో 94 శాతం మంది వద్ద ఆధార్ కార్డులు ఉన్నాయని లెక్క తేల్చిన అధికారులు, ఆధార్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అక్రమాలను మరింత సులువుగా అరికట్టవచ్చని భావిస్తున్నారు.
తొలి దశలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, నడకదారి భక్తులకు ఆధార్ తప్పనిసరి చేయాలని నిర్ణయించుకున్న అధికారులు, విదేశాల్లో ఉండే వారికి మాత్రం పాస్ పోర్టు నంబరును ఆప్షన్ గా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఆధార్ తప్పనిసరిపై ఇప్పటికిప్పుడు ఒత్తిడి తేబోమని, దీనిపై భక్తుల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన తరువాతనే అమలు చేస్తామని అధికారులు అంటున్నారు.