దక్షిణ కొరియాలో యువతి చేసిన పిచ్చి పని ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒసాన్ నగరంలో తన ఇంట్లోకి వచ్చిన బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రేను ఉపయోగించింది. ఈ క్రమంలో తన ఫ్లాట్‌కే నిప్పుపెట్టుకుంది.
తర్వాత మంటలు మొత్తం అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పొరుగున ఉండే మహిళ చనిపోగా, ఆమె భర్త, 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. 30కిపైగా నివాసాలున్న బిల్డింగ్‌లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు వారెంట్ కోరనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అగ్నిప్రమాదంలో మరణించిన మహిళ, ముప్పై ఏళ్ల వయసు గల చైనా పౌరురాలు. ఆమె తన భర్తతో, రెండు నెలల బిడ్డతో కలిసి భవనం ఐదో అంతస్తులో నివసించేది. మంటలు అంటుకున్నాయని తెలుసుకున్న వెంటనే, ఆ దంపతులు కిటికీ తెరిచి సహాయం కోసం అరిచారు. వారు ముందుగా తమ బిడ్డను పక్క భవనంలో ఉన్న పొరుగువారికి కిటికీ ద్వారా అందజేశారు. ఆపై భర్త పొరుగువారి భవనానికి ఎక్కి తప్పించుకోగలిగాడు. కానీ మహిళ అదే ప్రయత్నంలో కిందపడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, గంటల వ్యవధిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
భవనం మెట్ల మార్గం మంటల పొగతో నిండిపోవడంతో, ఆ దంపతులు కిటికీ ద్వారా తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఆ భవనంలో మొదటి అంతస్తులో వ్యాపార దుకాణాలు ఉండగా, రెండో నుండి ఐదో అంతస్తు వరకు 32 నివాస గదులు ఉన్నాయి.
Also Read:కే ర్యాంప్..బ్రేక్ ఈవెన్!

