ఎక్స్‌రే అవసరం ఉన్నా లేకున్నా డబ్బుల కోసం ఓ డాక్టర్ ‘ఎక్స్‌రే’ రాస్తాడు. స్కానింగ్, ఎంఆర్ఐ, సిటి స్కాన్, ఇతర రక్త, మల మూత్ర పరీక్షలు అవసరం లేకున్నా “కమీషన్ల” కు కక్కుర్తిపడి టెస్టులు రాస్తాడు ఇంకోడాక్టర్. అవసరం ఉన్నా లేకపోయిన డబ్బుల కోసం ఖరీదైన టెస్టులు రాసి డబ్బులు గుంజుతున్నారు ఇంకొందరు డాక్టర్లు. కంటికి బదులు పంటికి ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉన్నారు. డబ్బు తప్ప మాకేం వద్దు … రోగి కష్టాలు రోగివి .. మాకేం అంటూ వైద్యో నారాయణ హరి అనే పదానికే మచ్చ తెస్తున్నారు.
అంతేగాదు ఏ ఆస్పత్రినైతే సంప్రదిస్తామో ఆ హాస్పిటల్ సంబంధించిన మెడికల్ షాపులోనే మందులు తీసుకోవాలి. ఎందుకంటే అందులో కమీషన్‌కు కక్కుర్తి. విదేశాల్లో సైతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదే. ఇప్పటికీ చాలా దేశాల్లో కొన్ని జబ్బులకు మందుల్లేకపోగా మరికొన్ని రోగాలకు పెద్ద పెద్ద ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఏదైన వైద్య పరీక్ష చేయించుకుంటే రిపోర్టుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇవాళ వైద్య పరీక్షలు చేయించుకుంటే రేపు రిపోర్టు పరిస్థితి. దీంతో రోగులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతు ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది ఫార్వర్డ్ హాస్పిటల్.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చిటికెలో మీ రోగాన్ని కనిపెడుతుంది. అంతేగాదు క్షణాల్లో మీ వైద్య పరీక్షల రిపోర్టును అందిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్న ఇది అక్షరాలా నిజం. మీరు ఫార్వర్డ్ ఆస్పత్రిలోకి ఎంటరై బరువు చూసుకునే యంత్రంలా ఉండే దానిపై ఎక్కి నిల్చుంటే చాలు. సెకన్లలో మీ బీపీ, హార్ట్ రేట్, రక్తంలో కొవ్వు, షుగర్ లెవల్ నమోదైపోతాయి. అక్కడి నుంచి కొంచెం పక్కకు తిరిగితే స్క్రీన్‌పై మీ వివరాలు ప్రత్యక్షం. మీ సమస్యల పరిష్కారానికి తగిన వైద్య సూచనలు తెర మీద ప్రత్యక్షం కావడం జరిగిపోతుంది. అంతేగాదు మీరు తీసుకోవాల్సిన మందులు, వాటి వివరాలు మీ స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తాయి.
ఇదంతా ఫార్వర్డ్ ప్రత్యేకత. ప్రపంచంలో చాలా రంగాల్లో మార్పులు వచ్చాయి కానీ. వైద్యంలో మాత్రం పరిస్థితి మారలేదు. ఈ ఆలోచనే ఆడ్రియాన్ ఔన్ అనే వ్యక్తి ఈ ఆస్పత్రిని ప్రారంభించేలా చేసింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఏర్పాటైన ఈ హైటెక్ ఆస్పత్రి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది అని అంటున్నారు ఆడ్రియాన్. కేవలం రోగమొచ్చినప్పుడు మందులిచ్చే వ్యవస్థగా పార్వర్డ్ పనిచేయదని, వ్యక్తి జన్యువివరాల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే సమస్యలకూ ముందస్తు పరిష్కారాలు కనుక్కునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
‘క్లినిక్లో సభ్యుడిగా చేరిన ప్రతి ఒక్కరికీ వారి అవసరాలను బట్టి కొన్ని సెన్సర్లు, ఎలక్రానిక్ గాడ్జెట్ల ఇస్తామని. వీటిద్వారా అందే సమాచారంతో సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వివరిస్తున్నారు. అవసరమొచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లడం. ఫీజు చెల్లించడం మందులు తెచ్చుకోవడం మనం చేసే పని. కానీ ఫార్వర్డ్లో ఇలా ఉండదు. నెలకు రూ.పదివేలు (149 డాలర్లు) చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి.
సాధారణ ఆసుపత్రులకు పూర్తి భిన్నంగా పనిచేసే పార్వర్డ్ క్లినిక్లలోనూ వైద్యులు ఉంటారు. వైద్య పరీక్షల సమయాన్ని అస్సలు వృధా చెయ్యరు.ఈ పనులన్నీ కంప్యూటర్లు, హైటెక్ సెన్సర్లు చూసుకుంటాయి. తద్వారా వైద్యులు రోగులకు మెరుగైన చికిత్స అందించడం ఎలా అనే అంశంపై దృష్టి పెట్టవచ్చని ఆయన అంటున్నారు. రానున్న రోజుల్లో వైద్యరంగంలో సమూలమార్పులు తీసుకువచ్చేందుకు ఫార్వర్డ్ దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే, ఈ టెక్నాలజీ మనదేశానికి వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో వేచిచూడాలి.