అభివృద్ధి.. సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్‌..

323
kcr etela
- Advertisement -

అభివృద్ధి,సంక్షేమమే ఎజెండా ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్‌. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుండగా మండలిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. గురువరాం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌తో పాటు జీఎస్టీ సవరణల బిల్లుకు అమోదం తెలిపారు మంత్రులు.

బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించే దిశగా రూపొందించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఉదయం 11.30 గంటలకు ప్రవేశపెట్టనున్నారు సీఎం. మూడురోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా సభ ప్రారంభం కాగానే పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదిస్తారు.

గత నాలుగేండ్లలో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా వృద్ధిచెందడం.. పన్నేతర రాబడి కూడా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగానే బడ్జెట్ పరిమాణం పెరుగుతున్నది. రుకు ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ పెద్ద పద్దులన్నింటినీ ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవసరమయ్యే నిధులను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయిస్తారని తెలుస్తున్నది.

పెన్షన్లకోసం రూ.5వేల కోట్ల నిధులను అదనంగా బడ్జెట్‌లో కేటాయించనున్నారు. అదేవిధంగా రైతుబంధు పథకానికి రూ.15వేల కోట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణమాఫీకి రూ. 20వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తున్నది. రైతుబీమాకు రూ.1500కోట్లు కేటాయించే అవకాశమున్నది. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉండనున్నాయి.

ఆంధ్రరాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్‌రెడ్డి, ఉమ్మడి ఏపీలో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నది సీఎం కేసీఆరే. స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేయనున్న తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.

- Advertisement -