పేరుకు16ఏళ్ళ యువకుడే..కానీ టార్గెట్ మాత్రం పెద్దది. ఏకంగా గవర్నర్ కుర్చీకే గాలం వేసేశాడు. రాజకీయాల్లో అనుభవం లేదు. నిజానికి ఓటు హక్కు కూడా రాలేదు. అలాంటి ఓ యువకుడు ఏకంగా ఓ రాష్ట్రానికి గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నాడు.
అవును..తాను పోటీలో గెలుస్తాడా? లేదా? అనే పక్కనపెడితే గవర్నర్ పదవికి పోటీ చేసి ఆందరి దృష్టిని ఆకర్షించాడు.
అమెరికాలోని కాన్సాస్‌లో త్వరలో గవర్నర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు 16ఏళ్ల జాక్ బర్గెసన్ అనే హైస్కూల్ విద్యార్థి పోటీ చేస్తున్నాడు.
ఈ సందర్భంగా స్థానికంగా ప్రసారమయ్యే ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ కార్యక్రమంలో జాక్ బుధవారం పాల్గొని మాట్లాడుతూ.. తాను కోరుకునేది.. పిల్లలు కూడా రాజకీయాల్లోకి రావాలని, తాను ఇంత వయసులో గవర్నర్‌కు పోటీ చేస్తున్నానంటే ఎవరూ దాన్ని అర్థం చేసుకోరని, కానీ మా సందేశాలతో ప్రజలకు మా లక్ష్యమేంటో అర్థమవుతందని ఆశిస్తున్నానని అన్నాడు. అంతేకాకుండా ఇకనైనా పాత రాజకీయ సంప్రదాయాలను మరిచి మార్పును కోరుకోవాలని అని అన్నాడు.
సాధారణంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పదవికి పోటీచేసే వారి వయసు కనీసం 30 సంవత్సరాలైనా ఉండాలి. కానీ కాన్సాస్‌లో అలాంటి నిబంధన లేదు. అందువల్లే జాక్ పోటీ చేయగలిగాడు. ఒకవేళ జాక్ గెలిస్తే.. అమెరికా చరిత్రలోనే అతి చిన్నవయసులో గవర్నర్‌గా ఎన్నికైన వ్యక్తిగా జాక్ నిలిచిపోవడం ఖాయం.