ఇటీవల జరిగిన స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ, రంగారెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. అలాగే వరంగల్ నుంచి గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌లో శుభాకాంక్షలు చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషిచేసిన నేతలు, కార్యకర్తలకు, గెలుపొందిన అభ్యర్థులకు ట్విట్టర్ ద్వారా కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని మరోసారి నిరూపితమైందన్నారు. ఇవేఫలితాలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లోనూ పునరావృతం అవుతాయని తెలిపారు. స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు తరువాత జరిగే జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక వరకు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు.
ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, లింగయ్య యాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు కేటీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.