ఫుట్‌పాత్‌లు, రహదారులపై అక్రమంగా ఏర్పాటుచేసిన బిల్ బోర్డులు, అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులన్నింటిని వారం రోజుల్లోగా తొలగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లతో నేడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఫుట్‌పాత్‌లపై అక్రమంగా అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు ఏర్పాటుచేసి పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. వీటన్నింటిని తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు.
ఫుట్‌పాత్‌లు, రహదారులపై ఉన్న ఈ అక్రమ బోర్డులను తొలగించే డ్రైవ్ ఈ వారం మొత్తం చేపట్టాలని స్పష్టం చేశారు. జూన్ రెండో వారంలో రుతుపవనాలతో వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రతి మున్సిపల్ వార్డుకు ఒక వర్షాకాల ప్రత్యేక బృందాన్ని కేటాయించామని తెలిపారు. వర్షాలు ప్రారంభం కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నందున ఈ వర్షాకాల బృందాలను రహదారులపై ప్లాస్టిక్‌ను ఎత్తివేయడం, భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగించాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన సాఫ్ హైదరాబాద్ – షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమ లొకేషన్లలో రెండు చొప్పున ఇంకుడు గుంతల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని, వీటితో పాటు స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా కూడా ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని జోనల్, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు.
నగరంలో 1200 రూపాయల నుండి లక్ష రూపాయల లోపు పన్ను చెల్లించే నివాస భవనాల రీ అసెస్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. నగరంలో సాయంత్రవేళలో గార్బేజ్‌ను ఎత్తివేయడానికిగాను అదనపు వాహనాల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం జరిగిందని, ఈ వాహనాల సేకరణకు వెంటనే టెండర్లను పిలవాలని సూచించారు. గార్బేజ్ వర్నలబుల్ పాయింట్‌లన్నింటిని ఎత్తివేయాలని స్పష్టం చేశారు. సుధీర్ఘ కాలంగా గైర్హాజరవుతున్న ఎస్.ఎఫ్.ఏలకు సంబంధిత ఏజెన్సీ ద్వారా నోటీసులు జారీచేయాలని పేర్కొన్నారు. నగరంలో నీటి కాలుష్యానికి కారణమవుతున్న పైప్‌లైన్‌లను గుర్తిస్తే వాటి స్థానంలో కొత్త పైప్‌లైన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు దానకిషోర్ తెలిపారు.నగరంలో నీటిని వృథా చేయడాన్ని నిరోదించాలని, రోడ్లపై చెత్తను కాల్చినవారికి జరిమానాలు విధించాలని పేర్కొన్నారు.
జూన్ 5న వాయు కాలుష్య నివారణ పై పలు కార్యక్రమాలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన జూన్ 5వ తేదీన వాయు కాలుష్యం అనే నినాదంతో పలు కార్యక్రమాలను గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు దానకిషోర్ తెలిపారు. ముఖ్యంగా చెత్తను, ఎండుటాకులను తగలబెట్టడాన్ని పూర్తిగా నివారించాలని, వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేలా పలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని జోనల్, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నివారించేందుకు వ్యక్తిగత వాహనాల ఉపయోగాన్ని తగ్గించాలని, రహదారులపై లేన్ డిస్‌ప్లేను పాటించాలని అన్నారు.
హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులు, యువకులు, సీనియర్ సిటీజన్లు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులతో స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను ఏరివేసే ప్లాగింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాట, అద్వైత్ కుమార్ సింగ్, సిక్తా పట్నాయక్, కెనడి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దీన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.