దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భద్రాద్రి సీతారామ కళ్యాణంతో వేడుకలు ప్రారంభయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఆవిర్భావ ఉత్సవాలను ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశ రాజధాని లోని ప్రజలకు తెలంగాణ ఔనత్యాన్ని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటూ, రాష్ట్ర ఏర్పాట్లు, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని తెలిపేలా తెలంగాణ భవన్ అధికారులు కార్యక్రమాలను రూపొందించారు.
తొలి రోజు ఉత్సవాల్లో భాగంగా, శ్రీ భద్రాద్రి సీతా రాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భద్రాద్రి ఆలయ స్థానాచార్యులు స్థల సాయి, ప్రధాన అర్చకులు సీతా రామాంజ చార్యులు సమక్షంలో సీతా రాముల కళ్యాణం ఘనంగా సాగింది. తెలంగాణ భవన్ లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాల చారి, రామచంద్రు తెజావత్, మందా జగన్నాథం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అనంతరం సంగీతా సిస్టిర్స్ రామదాసు సంకీర్తనలతో భవన్ ప్రాంగణం పులకించిపోయింది. హైదరాబాద్ కు చెందిన ఆరేళ్ల పూజ ఓం నమోశివాయ అంటూ చేసిన భరత నాట్యం అందర్ని మయిమరిపించింది. అనంతరం ప్రముఖ నాట్య కళాకారిణి వసుమతి చేసిన నాట్యం – శిల్పం డాన్స్ బ్యాలే ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. స్యాండ్ ఆర్ట్ తో మేలవింపుతో ఆమే చేసిన నృత్యం తొలి రోజు ప్రత్యేక ఆకర్షణ చెప్పాలి.
జూన్ 2 ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక ఏర్పాటు చేసిన భవన్ అధికారులు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ ఏర్పాట్లకు ఏమాత్రం తీసిపోకుండా తెలంగాణ భవన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నిమిషాలకు ఢిల్లీ లోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి
జాతీయ జెండా వందనంతో జూన్ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, భారత రత్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేయనున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనితీరు, మిషన్ భగీరథ లక్ష్యాలను చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్ ని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి ప్రారంభిస్తారు.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం తెలంగాణ భవన్ లోని ఓపెన్ ఆడిటోరియంలో నాదస్వరం కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
అనంతరం తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న వారికి తెలంగాణ రుచులతో గుర్తు చేసేలా ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు.చార్మినార్ లోని లాడ్ బజార్ ని తలపించేలా ఏర్పాటు చేసిన లాడ్ బజర్ లో సందడి వాతావరణం కన్పించింది. శనివారం వీకెండ్ కావడంతో మండే ఎండలను సైతం లెక్క చేయకుండ ఢిల్లీ వాసులు, తెలుగు వారు లాడ్ బజార్ కు సందర్శించారు. తెలంగాణలో ప్రత్యేకంగా చెప్పుకునే హైదరాబాద్ గాజులు, పోచంపల్లి, గద్వాల్, ఇకత్ డిజైన్ సారీలు, హస్త కళలను చూసి ఢిల్లీ వాసులు ఆకర్షితులయ్యారు. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా దొరికే హలీం, హైదరాబాద్ బిర్యాని రుచులతో సందర్శకులు ఎంజాయ్ చేశారు.