తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొంది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది.
గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల తాలూకు విషయాల పైన ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ అనే థీమ్ తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన ఆహ్వానంలో పేర్కొంది
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం ఒకటని, ప్రపంచ మాంద్యంలో కూడా భారతదేశం సరైన అభివృద్ధిని నమోదు చేసిందని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది.
భారతదేశం సైతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని, దీంతో పాటు ప్రపంచం సైతం భారత్ లో ఉన్న అవకాశాలపై అవగాహన చేసుకోవలసిన అవసరమున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగినదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. అందుకే భారత దేశం లోని ఆదర్శవతమైన కార్యక్రమాలపై చర్చించడానికి ముఖ్యమైన వక్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.
ఈ సమావేశం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతారని తెలిపింది.కెటి రామారావు ఆధ్వర్యంలో తెంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది. మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ రంగంలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఈ సదస్సుకు హాజరై తన అనుభవాలను పంచుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. తెలంగాణ అనుభవాలు ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపింది.