ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.
ఇక గడిచిన మూడు నెలల్లో వడదెబ్బకు తెలంగాణలో సుమారు 200 మంది మృతిచెందారు. ఒక్క మే నెలలోనే 72 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వడదెబ్బకు చనిపోతున్న వారిలో ప్రయాణికులే ఎక్కువగా ఉంటున్నారు. కూలి పనులకు వెళ్లేవారు, వ్యవసాయ పనులు, ధాన్యం విక్రయాలకు వెళ్తున్న రైతులు కూడా మరణిస్తున్నారు.
రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 మంది వరకు వడదెబ్బతో మరణించారు. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు.