తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేబట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో ముందడుగు విజయవంతంగా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఆరో ప్యాకేజీలో భారీ మోటార్ వెట్ రన్ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో నాలుగో మోటర్ వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. నందిమేడారంలో ఈ ట్రయల్ రన్‌ను సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నేడు మధ్యాహ్నం చేపట్టిన మూడో పంపు వెట్ రన్ విజయవంతమైన విషయం తెలిసిందే.
గత నెల 24, 25వ తేదీల్లో అధికారులు మొదటి, రెండో మోటర్ల వెట్ రన్ నిర్వహించారు. ఇవాళ మూడో, నాల్గవ మోటర్ వెట్ రన్లను చేపట్టారు. బుదవారం ఒక్క రోజే రెండు పంపుల వెట్ రన్ విజయవంతంలో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్ టన్నెల్లో భారీ పంపు హౌస్ నిర్మించారు. ఇక్కడికి వచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో ఏడు భారీ మోటర్లు ఏర్పాటు చేశారు. వెట్ రన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా జరగడంతో అధికారులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.