సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం అనుమతివ్వలేదని స్పష్టం చేశారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైకోర్టు అనుమతి మేరకు నిన్న థియేటర్ల యజమాన్యాలే టికెట్ల ధరలు పెంచినట్లు తమ దృష్టికొచ్చిందన్న తలసాని… సినిమా టికెట్ల ధరల పెంపుపై కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.
79 సినిమా థియేటర్లు రేట్స్ పెంచినట్టు మా దృష్టికి వచ్చిందన్నారు. హోం శాఖ, న్యాయ శాఖ అధికారులతో సమీక్షించామని చెప్పిన తలసాని సినిమా టిక్కెట్స్ పెంచుకోమని ప్రభుత్వం ఎవరికి చెప్పలేదన్నారు. సినిమా ప్రేక్షకులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. సినిమా టికెట్ల ధరలు ఎలా ఉండాలన్న అంశంపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన మహర్షి. మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే టిక్కెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోగా మహర్షి సినిమా రోజుకి ఐదు షోలు వేసుకోవడంతో పాటు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిందనే వార్త చక్కర్లు కొడుతోంది.ఈ నేపథ్యంలో స్పందించారు తలసాని.