ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీలో ఎన్నికల వేళ బోలెడన్ని నవ్వులు కురిపించి ఎంతో హంగామా చేశారు. విచిత్రమైన హావభావాలతో అందిని ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఓ సందర్భంలో కన్నీరు కూడా కార్చారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడిన అది పెద్ద సంచలనం అయ్యాయి. నేనే సీఎం అవుతానని.. ఆంధ్రాను అమెరికా చేస్తానని.. నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తానని.. ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసిన పాల్ మరోసారి తనకు తోచిన రీతిలో కామెంట్లు చేశారు. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈ మత ప్రచారకుడు తన భద్రతపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని, రేవంత్ రెడ్డి అడిగితే క్షణాల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని, తాను అడిగితే కనీస స్పందన కూడా ఉండదని వాపోయారు. “నా శిష్యుడు రేవంత్ రెడ్డికో న్యాయం, నాకో న్యాయమా!” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అయినా ఎవరూ స్పందించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.