తెలంగాణలో స్ధానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగనుంది. కొడంగల్ నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి, మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వరంగల్‌లో కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. తాజాగా ఈ మూడు స్ధానాలకు ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేటీఆర్ పార్టీ నేతలతో చర్చలు జరిపిన అనంతరం మూడు పేర్లను ఫైనల్ చేశారని తెలుస్తోంది. రంగారెడ్డి స్థానం నుండి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ స్థానంలో పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలను బరిలో దించనున్నట్లు తెలిసింది.
రంగారెడ్డి స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేయకుండా ఉన్నారు. ఈ స్థానంలో గెలిచి జిల్లాలో ప్రాభవాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఇతరత్రా అవకాశాలపై ఆశతో ఉన్నారు. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన పోచంపల్లిని వరంగల్‌లో బరిలో దించనున్నారని టాక్. జిల్లాలో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా బలంగా ఉండటంతో ఆయన విజయం ఖాయమనే భావనతో టీఆర్ఎస్ ఉంది.
ఇక సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన గుత్తాకు నల్గొండ నుండి అవకాశం దక్కనుంది. పార్టీ నేతలు తేరా చిన్నపరెడ్డి, చాడా కిషన్‌రెడ్డి లాంటి వారు పోటీలో ఉన్న కేసీఆర్..గుత్తా అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
ఈ మూడు స్ధానాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నేపథ్యంలో రెండు,మూడు రోజుల్లో ఆయా జిల్లాల మంత్రులు, నేతలతో సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. ఆ తర్వాత అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.