హైదరాబాద్ నగరంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున నగరంలోని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలివేంద్రాల ఏర్పాటుతో పాటు నగరంలో అసంపూర్తిగా ఉన్న బస్షెల్టర్ల నిర్మాణం పూర్తి, వాటర్ ఏటిఎంలన్నింటిని పూర్తిస్థాయిలో పనిచేయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వెల్లడించారు. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో నేడు ప్రత్యేక సమావేశాన్ని దానకిషోర్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విపత్తుల నివారణ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, జలమండలి డైరెక్టర్ అజ్మిరా కృష్ణ తదితరులు హాజరైన ఈ సమావేశంలో కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా చలివేంద్రాలను ఏర్పాటు చేశాయని, వీటికి అదనంగా నగరంలోని ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రేపటి నుండి మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో 129 వాటర్ ఏటిఎంలను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా వీటిలో 102 ఏటిఎంలు పనిచేస్తున్నాయని నిర్వహకులు తెలుపగా అన్ని వాటర్ ఏటిఎంలు పనిచేసేలా చర్యలు చేపట్టడంతో పాటు వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో బస్ షెల్టర్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, బస్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీలను కోరారు. నగరంలో ఏర్పాటుచేసిన ఏసి బస్ షెల్టర్లలో ఏసిలు పనిచేయడంలేదని ఫిర్యాదులు అందుతున్నందున వాటిని తనిఖీచేసి నివేదిక సమర్పించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌ను కమిషనర్ ఆదేశించారు.
జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న లూ-కేఫేలలో కూడా ఉచితంగా మంచినీటిని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 2,283 బోర్‌వెల్స్‌ను, 2,555 పవర్ బోర్‌వెల్స్ అన్నింటిని పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మరిన్ని చలివేంద్రాల ఏర్పాటుకు ఆహ్వానం
హైదరాబాద్‌లో చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకురావాలని స్వచ్ఛంద సంస్థలకు కమిషనర్ దానకిషోర్ పిలుపునిచ్చారు. నగరంలో ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు పూర్తిస్థాయిలో జలమండలి సహకరిస్తున్నాయని తెలిపారు. చలివేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునేవారు జలమండలి ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ అజ్మిరా కృష్ణ ఫోన్ నెం: 99899 85899, ప్రజా సంబంధాల అధికారి సుభాష్ ఫోన్ నెం: 91001 08462 అనే నెంబర్ల ద్వారా సంప్రదించాలని దానకిషోర్ తెలియజేశారు