పొద్దున లేచిందంటే ముందుగా కావాల్సింది స్ట్రాంగ్ ఛాయ్. మరీ ఛాయ్ తాగలంటే చిల్లర కావాలి. ఇప్పుడు ఎక్కడా చిల్లర దొరకడం లేదు. మరి ఛాయ్ ఎలా తాగుతారు ? ఆన్లైన్ లో బిల్ కట్టేస్తే, వేడి వేడి చాయ్ తాగొచ్చు. ఢిల్లీలోని ఆర్కే పురమ్‌లో ఓ చాయ్ షాపు ఓనర్ కస్టమర్ల దగ్గర నుంచి ఆన్లైన్లో బిల్లు వసూల్ చేస్తున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతటా చిల్లర దొరకడం కష్టమైంది. దాంతో టీ స్టాల్ నడిపే ఆ వ్యాపారి తన కస్టమర్లకు ఆన్లైన్ బిల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాడు. టీ స్టాల్ ఓనర్ ఇచ్చిన ఆఫర్‌ను స్థానిక కస్టమర్లు స్వాగతిస్తున్నారు.
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతోపాటు ఏటీఎం, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధించిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలు చేయండని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకుల్లో సరిపడా క్యాష్ లేకపోవడం.. ఏటీఎంలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఇంకో మూడు వారాలు పట్టనున్న నేపథ్యంలో ఆన్లైన్లో పేమెంట్ చేయండని తెలిపింది.
బ్లాక్‌మనీ, నకిలీ కరెన్సీ నోట్లకు చెక్ పెట్టడంతోపాటు ప్రజలు నగదురహిత లావాదేవీల వైపు మళ్లేందుకు ప్రోత్సహించడమే తాజా నిర్ణయం అంతర్లీన ఉద్దేశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీలను ఆన్లైన్ విధానంలో జరిపేందుకే వినియోగదారులు లేదా బ్యాంక్ ఖాతాదారులు మొగ్గుచూపే అవకాశం ఉంది.
సంప్రదాయ బ్యాంకింగ్ లావాదేవీలకు ప్రత్యామ్నాయాలైన నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లోనూ ప్రజలు టెక్నాలజీ ఆధారిత సేవలను ఉపయోగించుకోవడం కొనసాగిస్తే.. ఆర్థిక వ్యవస్థలో జరిగే మొత్తం లావాదేవీల్లో ఈ-ట్రాన్సాక్షన్లదే మెజారిటీ వాటా కానుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.