కాంగ్రెస్ నేతలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని ప్రజల నుండి దూరమవుతామనే బాధలో కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా అని ప్రశ్నించిన తలసాని అలీబాబా 40 దొంగలు కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని ఎద్దేవాచేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కూడా కాంగ్రెస్ నేతలకు తెలియద న్నారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని,తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగురవేస్తారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రైతులకు జీవనాడి అని అన్నారు. వెట్‌రన్‌ను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్‌పై విశ్వాసంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపిన తలసాని కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో కూర్చొని అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నేతలకు కర్రు కాల్చి వాతపెట్టిన విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.