తెలంగాణ ప్రభుత్వం త్రాగునీటి సమస్య శాస్వతంగా లేకుండా చేయాలని ప్రతి ఇంటికి మంచినీటిని అందించేందుకు నిర్మిస్తున్న గొప్ప పథకం మిషన్ భగీరథ. ఈ పథకాన్ని దేశం గర్వించదగ్గ రీతీలో రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి తాజాగా ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు దక్కింది. మౌలిక వసతుల కల్పన – వినూత్న విధానాల విభాగంలో అవార్డు ఇవ్వాలని హడ్కో(కేంద్ర గృహ నిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ) నిర్ణయించింది.
ఢిల్లీలో గురువారం జరిగే హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అవార్డును మిషన్ భగీరథ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కృపాకర్‌రెడ్డి స్వీకరిస్తారు. ఈ విభాగంలో మిషన్ భగీరథకు ఇప్పటికే రెండుసార్లు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అనుకున్న సమయానికి మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతీ ఆవాసానికి తాగునీటిని అందించగలుగుతున్నామన్నారు. తమ ఇంజినీర్లు, సిబ్బంది, వర్క్ ఏజెన్సీల సమిష్టి కృషితో దేశం మొత్తానికి మిషన్ భగీరథ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తాగునీటి సమస్య ఉండదని కృపాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు.