అమెరికాలోని లాస్‌ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో సోమవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టులో తుపాకీ పేలిన శబ్ధం రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో భద్రతా బలగాలు విమానాశ్రయాన్ని చుట్టుముట్టాయి. ఎయిర్‌పోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్న బలగాలు అణువణువు గాలించారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి కాల్పులు జరగలేదని, అయితే పెద్ద శబ్దాలు మాత్రం వినిపించాయని పోలీసులు వెల్లడించారు. ఆ శబ్దాలు వచ్చిన ప్రదేశాన్ని గాలిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిగినట్లు పుకార్లు రావడంతో తాము ముందు జాగ్రత్తగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అంతకుముందు ట్విట్టర్‌లో తెలిపారు. సెంట్రల్ టెర్మినల్‌లోని అరైవల్, డిపార్చర్స్ గేట్లను మూసివేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ మొత్తాన్నీ ఖాళీ చేయించారు. చాలామంది ప్రయాణికులు పరుగెత్తడం కనిపించింది. అయితే అంతకుముందు సోషల్ మీడియాలో మాత్రం ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు జరిగాయని, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాల్పులు జరిగినట్లు ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారని, అయితే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.