ఎన్నికల వేళ కాంగ్రెస్,తెలంగాణ జనసమితి పార్టీలకు గట్టిషాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి,గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్ధిరాజు రవిచంద్ర,వరంగల్ జిల్లాకు చెందిన టీజేఎస్ నేతత,ఎన్నారై పగిడిపాటి దేవయ్య టీఆర్ఎస్‌లో చేరారు. చివరివరకు ఖమ్మం ఎంపీ సీటు ఆశీంచిన రవిచంద్రకు కాంగ్రెస్ మొండిచేయి చూపడంతో ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.బీజేపీ, టీజేఎస్‌ల్లో పనిచేసిన పగిడిపాటి దేవయ్య ..ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
బంగారు తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై టీఆర్ఎస్‌లో చేరానని రవిచంద్ర ఈ సందర్భంగా తెలిపారు. దేశరాజకీయాల్లో రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని తెలిపారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోబోతోందన్నారు. పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పజెప్పిన నిర్వహిస్తానని జిల్లా నేతల సహకారం, సమన్వయంతో ముందుకుసాగుతానని చెప్పారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్‌కు 83,922 ఓట్లు రాగా, రవిచంద్రకు 55,140 ఓట్లు వచ్చాయి.
2015 వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు పగిడిపాటి దేవయ్య. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ నుండి ప్రజాకూటమి అభ్యర్థిగా వర్దన్నపేట బరిలో దిగిన దేవయ్య టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.