ముంబై ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్-12లో చెన్నైకి చెక్ పడింది. హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన ధోనీసేనకు ఈ సీజన్లో తొలి ఓటమి రుచి చూపింది ముంబై. ఓపెనర్లు డికాక్ (4), రోహిత్ (13)లతో పాటు యువరాజ్ (4) విఫలమవడంతో ముంబయి 9 ఓవర్లకు 50/3తో కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్ (59; 43 బంతుల్లో 8×4, 1×6), కృనాల్ పాండ్య (42; 32 బంతుల్లో 5×4, 1×6), హార్దిక్ పాండ్య (25 నాటౌట్; 8 బంతుల్లో 1×4, 3×6),పొలార్డ్ (17 నాటౌట్; 7 బంతుల్లో 2×6) మెరుపులతో ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 133 పరుగులకే చాప చుట్టేసింది. రాయుడు (0),వాట్సన్ (5), రైనా (16),ధోని (12) అంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. కేదార్ జాదవ్ (58; 54 బంతుల్లో 8×4, 1×6) టాప్‌స్కోరర్. హార్దిక్ పాండ్య (3/20), మలింగ (3/34), బెరెన్‌డార్ఫ్ (2/22) చెన్నైకి కళ్లెం వేశారు. హార్దిక్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నాలుగు మ్యాచ్‌ల్లో ముంబయికిది రెండో విజయం కాగా చెన్నైకి ఇది ఓటమి.
ముంబయి జట్టులో అన్నదమ్ములైన కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య ఉండగా చెన్నైలో దీపక్ చాహర్, రాహుల్ చాహర్ సోదరులు తుది జట్టులో చోటుదక్కించుకున్నారు.