తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకూ ఎమ్మెల్యేలు పార్టీ మారగా..ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఆపార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆ పార్టీకి రాజీనమా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే కేఎస్ రత్నం గులాబీ తీర్ధం పుచ్చుకొనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా రత్నం టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమారక్ రెడ్డికి ఓ లేఖ రాశారు.
గత ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ లో చేరిన తనకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశమిచ్చినందుకు ఉత్తమ్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నానని…కావున ఆమోదించాల్సిందిగా రత్నం ఉత్తమ్ ను కోరారు. రత్నం టిడిపి నుంచి 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కేఎస్ రత్నం కాంగ్రెస్ అభ్యర్ధి కాలే యాదయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాలే యాదయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో 2018 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధి కాలే యాదయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. రత్నం ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారని…తర్వలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది.