కాషాయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి మరో షాకిచ్చింది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ అగ్రనేతలైన అద్వానీ,మురళీ మనోహర్ జోషిలకు మొండిచేయి చూపింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించగా వీరిద్దరి పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఉమా భారతి, నిర్మలా సీతారామన్, యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఇప్పటికే అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ సీటును బీజేపీ చీఫ్ అమిత్ షాకి కేటాయించి షాకిచ్చిన మోడీ తాజాగా స్టార్ క్యాంపెయిన్ల జాబితలోనూ మొండిచేయి చూపించారు. దీంతో ఇక బీజేపీలో అద్వానీ శకం ముగిసినట్లే.
భారత రాజకీయాల్లో ‘భీష్మాచార్యుడి’గా పేరొందారు అద్వానీ. గాంధీనగర్ నుండి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు కనిపించకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేన సైతం అద్వానీ శకం ముగిసినట్లేనని పార్టీ అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. అద్వానీని బలవంతంగా రాజకీయాల నుండి రిటైర్ అయ్యేలా చేశారని శివసేన వ్యాఖ్యానించింది.