ప్రకాష్‌ రాజ్‌..గెలిస్తే రికార్డే..!

282
Prakash ra
- Advertisement -

విలక్షణ నటుడిగా జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. విలన్ పాత్ర అయినా, క్యారెక్టర్ రోల్ అయినా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పించగలిగే సత్తా ఆయన సొంతం. తన నటనతో సౌత్‌లో అత్యధిక పారితోషకం అందుకునే నటుడిగా గుర్తింపుపొందారు. ఇప్పటివరకు సినిమాలతోనే మెప్పించిన ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. సమకాలిన రాజకీయాలపై తనదైన శైలీలో స్పందిస్తున్న ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నడనాట రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి.

ఇక ప్రకాష్ రాజ్ గెలిస్తే సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. ఏ పార్టీ గుర్తు లేకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టడం చాలా కష్టం. జాతీయస్ధాయి రాజకీయాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు చాలామంది గెలవడం చూసాంటం కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అలాంటి సంఘటన చాలా అరుదు.

ఇక కర్ణాటక విషయానికొస్తే అదో అద్భుతమే. చివరిసారిగా 1967లో మైసూరు స్టేట్‌లోని కెనరా నియోజకవర్గం నుండి దినకర దేశాయ్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టగా గడచిన 52 ఏళ్లలో మరే స్వతంత్ర అభ్యర్థి పార్లమెంట్‌ గుమ్మం తొక్కలేదు.

1951 నుండి ఇప్పటివరకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో మొత్తం 2,337 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా ఒక్కరే గెలుపుబాటపట్టారు. ఈ నేపథ్యంలో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఏ పార్టీ మద్దతు లేకుండా స్వంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్ తో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడింది. 19 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండగా ముస్లింలు, ఇతర ప్రాంతా ల నుంచి సెటిల్‌ అయినవారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ నుండి వరుసగా 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున పి.సి.మోహన్‌ గెలుస్తున్నారు.

ఈ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సి.వి.రామన్‌ నగర్‌, మహదేవ్ పుర ఎస్సీలకు రిజర్వ్‌ కాగా 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండింటితో పాటు రాజా జీనగర్‌ ఎమ్మెల్యే స్థానాన్నికూడా బీజేపీయే గెలుచుకుంది. మిగతా అయిదు సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు.

ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గెలుపుకోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తమిళియన్లు గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఉండటంతో పాటు మిడిల్‌ క్లాస్‌ పబ్లిక్ ఎక్కువగా ఉండటంతో బెంగళూరు సెంట్రల్‌ను సేఫ్‌ ప్లేస్‌గా ప్రకాష్‌ రాజ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కలిసివస్తుందని భావిస్తున్నారు.

కర్ణాటకలో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, నోట్ల రద్దు తదితర అంశాలపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా మోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి గట్టి సవాల్ విసురుతున్న ప్రకాష్ రాజ్ 52 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తారా లేదా వేచిచూడాలి.

- Advertisement -