లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల నుండి 62 మంది పేర్లకు ఎన్నికల సంఘం అమోదముద్ర వేసింది. అధికార టీఆర్ఎస్ 20 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈసీకి అందజేసింది. కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 11 మంది మంత్రులతో పాటు సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు జె.సంతోష్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బండా ప్రకాశ్, టి.రవీందర్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది.
ఈ లిస్టులో మాజీ మంత్రి,పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పేరు లేకపోవడం గమనార్హం. ఇక మజ్లిస్ నుండి అసదుద్దీన్, అక్బరుద్దీన్ , బీఎస్పీ తరఫున మాయావతి సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారని ఆయా పార్టీలు ఈసీకి జాబితా అందజేశాయి.
ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంది. ఆఖరి నిమిషంలో టికెట్లు దక్కించుకున్న ఆశావాహులు, టికెట్లు దక్కని అసంతృప్తులు, సంఖ్యాశాస్త్రం, ముహూర్తాలు, జాతకాలతో ఇప్పటివరకు వేచి ఉన్న వారంతా ఈ రోజు నామినేషన్ల బాట పట్టనున్నారు. దీంతో నామినేషన్ కేంద్రాలు సందడిగా మారనున్నాయి.