ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓ వైపు సినీ గ్లామర్ మరోవైపు బంధుత్వాలతో టాక్ ఆఫ్ ది న్యూస్‌గా నిలుస్తున్నాయి ఏపీ పాలిటిక్స్. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలకు కేరాఫ్‌గా మారింది టీడీపీ. ఏపీ సీఎం చంద్రబాబు బంధువర్గం దగ్గరి నుండి మంత్రులు,ఎమ్మెల్యేల బంధువులందరూ ఎన్నికల రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఏడో సారి బరిలోకి దిగుతుండగా బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి పోటీకి సిద్ధమయ్యారు. చంద్రబాబు తనయుడు, బాలకృష్ణ పెద్ద అల్లుడు నారాలోకేష్ మంగళగిరి అసెంబ్లీ నుండి పోటీచేస్తుండగా విశాఖకు చెందిన బాలయ్య చిన్నల్లుడు ఎంవీవీఎస్ మూర్తి మనుమడు భరత్ విశాఖ ఎంపీగా పోటీచేస్తున్నారు. భరత్ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మనుమడు కూడా.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాబాయ్, అబ్బాయ్ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీ చేస్తుండగా రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా బరిలో ఉన్నారు. రామ్మోహన్నాయుడు సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేస్తుండగా ఆయన మామ బండారు సత్యనారాయణమూర్తి తిరిగి పెందుర్తి బరిలో పోటీ పడుతున్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన వియ్యంకులిద్దరూ అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన విద్యావేత్త,మంత్రి నారాయణ నెల్లూరు అర్బన్ నుండి బరిలో దిగుతుండగా గంటా మరోవియ్యంకుడు ఎమ్మెల్యే రామాంజనేయులు భీమవరం నుండి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా వియ్యంకులే. విజయనగరంలో తండ్రి అశోక్‌గజపతిరాజు ఎంపీగా పోటీ చేస్తుంటే ఆయన కుమార్తె అదితి విజయనగరం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు , కొమ్మాలపాటి శ్రీధర్ 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత వియ్యంకులయ్యారు. వీరిద్దరూ మరోసారి పోటీ చేస్తున్నారు.
ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి పోటీ చేస్తున్న బ్రహ్మానందరెడ్డిలు అన్నా,చెల్లెళ్లు. కోట్ల సూర్యాప్రకాశ్రెడ్డి కర్నూలు ఎంపీగానూ, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పలమనేరు నుంచి పోటీ చేస్తున్న అమర్నాథ్రెడ్డి, పుంగనూరు నుంచి పోటీ చేస్తున్న అనూషారెడ్డి బావమరదళ్లు.నంద్యాల ఎంపీ అభ్యర్థి శివానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు చరితారెడ్డి అన్నా చెల్లెళ్లు.
అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్న జేసీ పవన్, తాడిపత్రి నుంచి పోటీ చేస్తున్న ఆస్మిత్రెడ్డిలు వరుసకు సోదరులు. ఇద్దరూ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి వారసులు. పత్తికొండ నుంచి పోటీ చేస్తున్న కేఈ శ్యామ్, డోన్ నుంచి పోటీ చేస్తున్న కేఈ ప్రతాప్‌ది సోదరబంధమే.
అరకు అభ్యర్థి కిడారి శ్రావణ్‌కు పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి వరుసకు పెద్దమ్మ. కృష్ణా జిల్లాలో గుడివాడ అసెంబ్లీ బరిలో దిగిన దేవినేని అవినాష్‌కు మైలవరం నుంచి పోటీ చేస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాబాయ్అవుతారు. మొత్తంగా ఎన్నికల వేళ వారసత్వ రాజకీయాలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.