గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని చక్కదిద్దే పినలో పడింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో గోవా సీఎంగా బీజేపీ ఎవరిని నియమిస్తుంది అన్న వార్త రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు కాంగ్రెస్ మాజీ సీఎం దిగంబర్ కామత్‌ను బీజేపీలో చేర్చుకుని ఆయన్ని సీఎం చేసే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది.
మరోవైపు గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ సైతం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు, గవర్నర్ మృదుల సిన్హాను కోరారు. శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిం చాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
గవర్నర్‌కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడంతో బీజేపీ అప్రమత్తమైంది. వెంటనే పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయ్యింది. శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి తాజా పరిణామాలపై చర్చించిన నాయకులు, ఎమ్మల్యేలంతా కలసికట్టుగా ఉండాలని సూచించారు.
గోవా అసెంబీలో 40 స్థానాలుండగా 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 16, బీజేపీ 14 గెలిచాయి. మహారాష్ట్ర గోమాంతక్ పార్టీ 3 సీట్లు, గోవా ఫార్వర్డ్ పార్టీ 3 సీట్లు గెలవగా ఒక స్థానంలో ఎన్సీపీ, ముగ్గురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు పరికర్. తర్వాత బీజేపీ ఎమ్మెల్యే డిసౌజా,తాజాగా పరికర్ చనిపోవడంతో బీజేపీ బలం 12కు పడిపోయింది. ప్రస్తుతం గోవాలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది. అయితే బీజేపీ మాత్రం మాస్టర్ ప్లాన్‌తో సీఎం పదవిని దక్కించుకునేందుకు కసరత్తు చేస్తోంది. బీజేపీ ప్లాన్ వర్కవుట్ అయితే పర్సేకర్ లేదా దిగంబర్ కామత్ నెక్ట్స్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.